ఏపీలో ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్ – ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల సాయం | Ap PMAY
ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణం చేసుకునే వారికి శుభవార్త. కాకినాడ జిల్లాలో సొంత స్థలం కలిగిన అర్హులైన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన-2.0 (PMAY 2.0) పథకం కింద గృహాలు మంజూరయ్యాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు అధికారిక సమాచారం. ఈ దశలో 2,226 మందికి లబ్ధి చేకూరనుంది. త్వరలోనే మరిన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పథకాన్ని విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ పథకం కాకినాడ నగరపాలక సంస్థతో పాటు సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, తుని మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలు వంటి ప్రాంతాల్లో అమలు అవుతోంది. కనీసం రెండు సెంట్లు లేదా సెంటున్నర స్థలం ఉన్నవారికి ఇళ్లు మంజూరు చేశారు.
ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కూడా లభిస్తుంది. ఇప్పటికే మూడో విడతలో మరో 189 ఇళ్లకు డీపీఆర్ పంపగా, ఆమోదం రావాల్సి ఉంది. కాకినాడ జిల్లాలో ఇప్పటివరకు 4,374 మంది సొంత స్థలాలు ఉన్నవారిని గుర్తించారు. కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల పరిధిలో ఈ పథకం కొనసాగుతోంది. అదేవిధంగా తాళ్లరేవు, కాజులూరు, పెదపూడి మండలాలకు కూడా డీపీఆర్ పంపించారు.
సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తారు. గ్రామ, వార్డు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ సిబ్బంది లబ్ధిదారుల వివరాలు ఆవాస్ ప్లస్ యాప్‌లో నమోదు చేస్తారు. ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా అర్హత నిర్ధారిస్తారు. సంవత్సర ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారికి ఈ పథకంలో అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కేంద్రానికి డీపీఆర్ పంపి, ఆమోదం రాగానే నిధులు విడుదల అవుతాయి.
👉 ఏపీలో సొంత స్థలం కలిగి, ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు ఈ PMAY 2.0 పథకం ద్వారా రూ.2.50 లక్షల ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంది.