ఏపీ పాడిరైతులకు శుభవార్త – ష్యూరిటీ లేకుండా రూ.2 లక్షల రుణం | Ap Pashu Kisan Credit Card 2025
ఏపీలో పాడి రైతులకు మంచి శుభవార్త లభించింది. ఇకపై ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే రూ.2 లక్షల వరకు రుణం పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ పథకం పేరు పశు కిసాన్ క్రెడిట్ కార్డు. దీనిని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.
రుణం పొందడానికి రైతులు తమ ప్రాంతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా రైతు 15 శాతం మొత్తం చెల్లిస్తే, మిగతా మొత్తాన్ని బ్యాంకులు ష్యూరిటీ లేకుండానే రుణంగా ఇస్తాయి. రైతులు తీసుకున్న రుణాన్ని నెలవారీ వాయిదాలుగా తిరిగి చెల్లించాలి. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులందరికీ ఈ రుణం అందుబాటులో ఉంటుంది. అయితే జంతువుల ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే భరించాల్సి ఉంటుంది.
జిల్లా కలెక్టర్లు స్వయంగా బ్యాంకులను పర్యవేక్షిస్తూ అర్హులైన పాడి రైతులకు సకాలంలో రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ బీమా యోజన వంటి పథకాలను అమలు చేస్తోంది.
ప్రభుత్వం, బ్యాంకులు అందిస్తున్న ఈ రుణాలను రైతులు సద్వినియోగం చేసుకుంటే పాడిపరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.