పింఛన్ స్కాం బహిర్గతం.. అనర్హుల వేట, వైద్యులపై కూడా చర్యలు! – AP Govt News 2025
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల పింఛన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. అర్హతలేని వారు ఈ పింఛన్లు పొందుతున్నారనే అనుమానాలపై ప్రభుత్వం కఠిన చర్యలు మొదలుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యుల ద్వారా వికలాంగత శాతం పరీక్షించారు. 40 శాతం కన్నా తక్కువగా ఉన్నవారికి నోటీసులు ఇచ్చి పింఛన్లు నిలిపివేశారు.
అయితే, నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మంది అప్పీలు చేశారు. అందువల్ల ప్రభుత్వం తాత్కాలికంగా సెప్టెంబర్ నెల పింఛన్లు పంపిణీ చేసింది. ఇకపై రెండోసారి స్క్రీనింగ్ నిర్వహించి, నిజమైన అర్హులను జాబితాలో కొనసాగించనుంది. నకిలీ అని తేలితే పింఛన్లు పూర్తిగా రద్దు చేస్తారు.
ఇక నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన వైద్యులపై కూడా చర్యలు తప్పనిసరిగా ఉంటాయని సమాచారం. ఈ నేపథ్యంలో వికలాంగుల సంఘాలు కూడా సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు చేస్తూ, నకిలీ సదరం సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై సీఎం కార్యాలయం స్పందించి, వైద్య ఆరోగ్యశాఖ ఒక నెలలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.