చేనేత మగ్గాలకు 200 యూనిట్లు – పవర్ లూమ్స్‌కి 500 యూనిట్లు ఉచితం | AP Free Electricity Scheme 2025
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఉచిత విద్యుత్ పథకం ఇప్పుడు అమలు దశలోకి అడుగుపెట్టింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించనున్నట్లు చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి స్పష్టం చేశారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రకారం, చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు (పవర్ లూమ్స్) నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఇప్పటికే హామీ ఇచ్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో పవర్ లూమ్స్‌కు బిల్లులు వస్తున్నాయంటూ వార్తలు వస్తుండటంతో.. ఈ సందేహాలపై అధికారులు స్పష్టతనిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 93 వేల చేనేత కార్మిక కుటుంబాలు, 11,488 పవర్ లూమ్స్ ఉన్నాయని రేఖారాణి వివరించారు. వీరందరికీ ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన ఇంటింటి సర్వే పూర్తయిందని, అతి త్వరలో లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆమె తెలిపారు.
అలాగే, ఇప్పటివరకు చేనేత మగ్గాలకు నెలకు 100 యూనిట్లు, మరమగ్గాలకు 50% రాయితీతో విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ చర్యలు చేపడుతోందని, వాటిలో భాగంగానే ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.