ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు నెలకు ₹1500 ఆర్థిక సహాయం అందించే ఆడబిడ్డ నిధి పథకం పై ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న ఆసక్తి నెలకొంది. తాజాగా శాసన మండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీనిపై స్పష్టతనిచ్చారు. గతంలో ఈ పథకం పేరుతో వైసీపీ మోసం చేసిందని విమర్శల మధ్య, కొత్త ప్రభుత్వం అమలు విధానాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల అర్హత ఉన్న మహిళలకు ఈ పథకం కింద నెలకు ₹1500 అందిస్తామని స్పష్టం చేశారు. అయితే అమలు కోసం సమగ్ర అధ్యయనం జరుగుతోందని, అంచనాలు పూర్తయ్యాక ఇతర సంక్షేమ పథకాల మాదిరిగా దీన్ని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
గతంలో టీడీపీ ప్రభుత్వమే సుమారు 89 లక్షల మహిళలకు మొత్తం ₹20,000 చొప్పున ఇచ్చిన ఘనత సాధించిందని గుర్తుచేశారు. ఇక వైసీపీ పాలనలో ‘చేయూత’ పేరుతో ఇచ్చిన హామీ అమలు సరిగా జరగలేదని, కేవలం 25 లక్షల మందికే డబ్బులు అందాయని అన్నారు.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని P4 స్కీమ్‌లో భాగంగా కలిపి అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తుది విధివిధానాలు ఖరారైన వెంటనే మహిళలకు నెలకు ₹1500 ఆర్థిక సహాయం అందించే ఆడబిడ్డ నిధి ప్రారంభం కానుంది.








