ఆంధ్రప్రదేశ్ పింఛన్లపై కీలక అప్డేట్ | అక్టోబర్ నెలలో పెన్షన్ వస్తుందా? – AP Pension Update
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్లు పొందుతున్నవారికి కీలక అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ల విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ప్రభుత్వం వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, 40% కంటే తక్కువ వికలాంగత కలిగినవారికి నోటీసులు జారీ చేసింది.
గత నెల సెప్టెంబర్‌లో అయితే నోటీసులు అందుకున్నవారికీ సంబంధం లేకుండా అందరికీ పెన్షన్ మంజూరైంది. దీంతో అక్టోబర్‌లో పెన్షన్ వస్తుందా? రాదా? అనే సందేహం పెన్షనర్లలో ఎక్కువైంది.
సమాచారం ప్రకారం, నోటీసులు అందుకున్న వారిలో 90% పైగా దివ్యాంగులు అప్పీల్ చేసుకున్నారు. ఈ అప్పీలు రీ-అసెస్మెంట్ పూర్తయ్యే వరకు పింఛన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వైకల్యం శాతం 40% కన్నా తక్కువగా ఉన్నవారు వృద్ధాప్య పింఛన్ లేదా వితంతు పింఛన్‌కు అర్హులు అయితే, వారి కేటగిరీ మార్చి ఆ పింఛన్ అందించే విధానాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.
అందువల్ల సెప్టెంబర్లోలాగే అక్టోబర్ నెలలోనూ నోటీసులు అందుకున్నవారికి పెన్షన్ అందే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.








