ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కుటుంబాలకు కూడా తల్లికి వందనం పథకం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం | Thalliki Vandanam
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన నియమాల ప్రకారం ఈ పథకం ఒక్కో కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ వర్తింపజేసిన సంగతి తెలిసిందే. ముందుగా అర్హుల జాబితాను విడుదల చేసి, అర్హత ఉన్నా లబ్ధి రానివారికి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఈ పథకాన్ని ఆశావర్కర్లు మరియు అంగన్‌వాడీ సిబ్బంది కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం చేరిక తర్వాత పరిశీలించి నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. లబ్ధిలో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నామని, సమస్యలు ఉంటే వాట్సాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు.
లోకేష్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వమే విధించిన 300 యూనిట్ల వినియోగం, ఆప్కాస్ ఉద్యోగుల అర్హత, భూమి పరిమితి వంటి నియమాలను ప్రస్తుతం కూడా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అర్హులందరికీ పథకం అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా, తల్లికి వందనం పథకాన్ని ఆశావర్కర్లు మరియు అంగన్‌వాడీ సిబ్బంది కుటుంబాలకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
అర్హులైన విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరైన తర్వాతనే ఈ సాయం అందజేస్తామని, ఇంటర్ చేరిక తర్వాత మళ్లీ ధృవీకరించి నిధులు జమ చేస్తామని తెలిపారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం అందించే నగదు సాయాన్ని రాష్ట్ర పథకంతో కలిపి జమ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం డిజిటల్ రేషన్ కార్డులను కూడా మంజూరు చేసిందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేయడం తమ బాధ్యత అని లోకేష్ హామీ ఇచ్చారు.








