ఏపీ ప్రజలకు చంద్రబాబు శుభవార్త – సంజీవని పథకంతో ఇళ్ల వద్దకే వైద్య సేవలు, రూ.2.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్! | Sanjivani Health Scheme
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సంజీవని పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన ప్రకటించారు. ఈ పథకం కింద ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు, అలాగే రూ.2.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందించనున్నట్టు తెలిపారు.
మాచర్లలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రపంచ వ్యాపార దిగ్గజం బిల్ గేట్స్ సాంకేతిక సహాయం అందిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన సంజీవని పథకం విజయవంతమవడంతో, ఇప్పుడు చిత్తూరులో కూడా విస్తరించారని ఆయన చెప్పారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “రామాయణంలో హనుమంతుడు సంజీవని కోసం కొండను తెచ్చినట్లే, ఈ పథకం ద్వారా ప్రజల ఇంటి ముందుకే అత్యాధునిక వైద్య సేవలను తీసుకువస్తాం” అని అన్నారు. పేదా-ధనిక అనే తేడా లేకుండా అందరికీ యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద వైద్య సదుపాయాలు అందిస్తామని, ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నట్టు వెల్లడించారు.
అలాగే, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో త్వరలోనే ఉచిత వైద్య సేవలను ప్రారంభించనున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాకు సాగునీటి కోసం వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 1.25 లక్షల ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు. సాగర్ కుడి కాలువకు గోదావరి నీరు తేవడంలో, అలాగే మిర్చి బోర్డు ఏర్పాటులో కేంద్రంతో చర్చలు జరుపుతామని చంద్రబాబు ప్రకటించారు.








