పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధులు అక్టోబర్ 18న విడుదల.. రైతుల ఖాతాల్లో రూ.7వేలు! | PM Kisan Annadata Sukhibhava Funds 2025
పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకాల లబ్ధిదారుల కోసం ప్రభుత్వం కొత్త ప్రణాళిక రూపొందించింది. ఈ రెండు పథకాల నిధులను రైతులకు ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తొలి విడత నిధులు ఖాతాల్లో జమ కాగా, రెండో విడత మరియు పీఎం కిసాన్ నిధులు కలిపి రూ.7 వేల చొప్పున అక్టోబర్ 18న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీపావళి పండగకు ముందే రైతులకు ఈ సాయం చేరేలా ముహూర్తం ఖరారైంది.
ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల ప్రకారం, పీఎం కిసాన్ ద్వారా కేంద్రం నుంచి వచ్చే రూ.6 వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి సంవత్సరానికి మొత్తం రూ.20 వేలు రైతులకు అందించనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా జమ చేయాలని నిర్ణయించారు. కేంద్రం 21వ విడత పీఎం కిసాన్ నిధులను, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రెండో విడతను ఒకేసారి విడుదల చేయనుంది.
అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ కింద నిధులు ఇవ్వడం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మాత్రమే కౌలు రైతులకు రెండు విడతల్లో రూ.20 వేలు చెల్లించనుంది. వ్యవసాయ శాఖ ఇప్పటికే 46.64 లక్షల మంది రైతులను ఈ పథకాల అర్హులుగా గుర్తించింది. భూమి లేని కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డు పొంది, ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
దీపావళి పండగకు ముందే రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉత్సాహంగా ఉన్నారు. అర్హత కలిగిన రైతులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో తమ అర్హతను చెక్ చేసుకోవచ్చు.







